||సుందరకాండ. ||

||తత్త్వదీపిక - పదునెనిమిదవ సర్గ ||

||అన్వేషణ ఒక జన్మ సాదృశము||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ అష్టాదశస్సర్గః

తత్త్వదీపిక
ఒక రాత్రిలోజరిగిన అన్వేషణ ఒక జన్మల సాదృశము

విరబూసిన పుష్పములు కల వనములో
సీత కోసము అన్వేషణలో ఉండగా
"కించిత్ శేషా నిశాభవత్"
అంటే రాత్రిలో చాలా కొంచమే మిగిలి,
తెల్లవారుచుండెను ఆన్నమాట..

రాత్రి అంతా అయిపోతూ చీకటి ఆవరించి,
ఉన్న వస్తువులు వున్నట్లు కనపడని సమయములో,
హనుమ సీతను సీతా కాదా అనే సందిగ్ధము లోంచి బయటపడేసరికి,
రాత్రిలో కొద్ది భాగమే మిగిలెను.

ఈ రాత్రులే జన్మపరంపర.

రాత్రి చీకటి ఆవరించి ఉన్నవస్తువు ఉన్నట్లు కనపడని సమయము.

అజ్ఞానము ఆవరించి సద్వస్తువు అగు ఆత్మ కనపడకుండా చేయు జన్మమే ఒక రాత్రి.

అట్టి జన్మలెన్నో గడిచిన తరువాత,
భగవంతుని యందు అభిముఖము కలిగి,
భగవంతుని విడిచి ఉండలేనని వేదన కలిగి,
అతనిని పొందలేదే అని ఆర్తి కలుగును.

అదే మాట భగవద్గీతలో కూడా వింటాము
"బహూనాం జన్మనాం అంతే.." '
ఎన్నో జన్మలతరువాత ఆత్మజ్ఞానము అవుతుంది అని (భగ 7-03,20).

అప్పుడు భగవదనుగ్రహముచే లభించిన జ్ఞానము కల ఆచార్యుడు మనకు లభించును.
ఆ ఆచార్యుని సాన్నిహత్యములో సత్వ గుణము అభివృద్ధి పొందును.
ఆ సత్త్వగుణమే వెన్నెల.

అప్పుడే సాధకుడు అన్వేషణ చేయును.
ఆచార్యుడు శిష్యాన్వేషణ చేయును.
ఇట్టి అన్వేషణమే హనుమదన్వేషణము.

ఇది సాగిన రాత్రి ఒక జన్మము.
సాయంకాలము అన్వేషణ ఆరంభమైనది.
కొద్దిపాటి రాత్రి మిగిలియుండగా హనుమ సీతా దర్శనము చేసి మాట్లాడును.

ఇలా ఈ జీవితములో జరిగే సాధనక్రమము
మనకు హనుమంతుని అన్వేషణలో కనపడును.

అలాగే ఇంకాకొన్ని విషయములు మనకి కనిపిస్తాయి.

భగవంతునికి దూరమై, పొందవలెనని కోరికగలిగి
అర్తి కలిగియున్న జీవుడు
ఎట్లుండవలెనో సీతమ్మ స్థితి సూచించును.

అట్టి స్థితిలో,
అంటే జీవుడు భగవంతునికి దూరముగా ఉన్నస్థితిలో,
ఆత్మ మనస్సుతో పడెడి ఘర్షణ,
మనకి సీతా రావణుల సంవాదములో కనపడును.

దీనికి తట్టుకొని ఎదురుగా నిలిచినప్పుడు
గురువు అనుగ్రహము లభించి భగవత్ప్రాప్తి కలగ గలదు.
సీతారావణుని సంవాదమై రావణుని ధిక్కరించి నిలబడిన తరువాత
హనుమ సీతతో మాట్లాడును.
ముముక్షువగు జీవునకు మనసుతో కలిగెడి సంఘర్షణే
ఇపుడు సీతారావణ సమావేశమున మనము చూచెదము.

ఇప్పుడు రాత్రి అయిపోయినది సీతాన్వేషణ ముగిసింది.
ముందు జరిగేది ఇంకో సంగతి.
అదే పదునెనిమిదో సర్గ.
పదునెనిమిదో సర్గలో కథ క్లుప్తముగా ఇలా చెప్పెవచ్చు.

శింశుపావృక్షములో వున్న హనుమంతుడు
రాత్రి చివరి భాగములో షడంగవేదములలో పండితులైన ,
క్రతువులు చేయుటలో నిష్ణాతులైన బ్రహ్మరాక్షసుల బ్రహ్మ ఘోషణలను వినెను.
మహాబాహువులు కల మహా బలవంతుడైన పది తలలు కల రావణుడు
ఆ బ్రహ్మఘోషలతో వినుటకు మనోహరమైన మంగళవాద్యములతో మేల్కొనపడెను.

రాక్షసాధిపతి సమయానుసారముగా మేల్కొని,
జారిన వస్త్రములు మాలలు గల వాడై వైదేహి గురించి ఆలోచించ సాగెను.
ఆమె పై మదనకామముతో నిండిన ఆ రావణుడు తన కామమును అదుపులో నుంచుకొనలేకపోయెను.
అతడు అన్ని ఆభరణములతో సాటిలేని శోభతో విలసిల్లుతూ
అన్నిరకములపుష్పములు ఫలములు కల చెట్లతో నిండిన ఆ వనమును ప్రవేశించెను.

అలా అశోకవనముకు వెడుతున్న పౌలస్త్యుని,
వందమంది అంగనలు ఇంద్రుడిని దేవ గంధర్వ వనితలు అనుసరించినట్లు అనుసరించిరి.
అక్కడ కొందరు వనితలు దీపములను పట్టుకొని వెళ్ళుచుండిరి.
ఇంకొందరు చామరములను పట్టుకోని,
మరింకొందరు విసనకర్రలతోనూ అనుసరించిరి.

ముందర కొందరు బంగారుపాత్రలతో నీరు నింపుకొని నడవసాగారు.
కొందరు కత్తులు పట్టుకొని, తివాచీలను పట్టుకొని వెనుక వస్తున్నారు.
ఒక దక్షతకల భామిని తన దక్షిణ హస్తములో
మణి మయమైన పాత్రలో మద్యమును తీసుకొని అనుసరించెను.
ఇంకొక ఆమె రాజహంసలా వుండు పూర్ణచంద్రుని కాంతులు గల
బంగారుదండము కల చత్రము పట్టుకొని వెనుక రాసాగెను.

అతని ప్రియ భార్యలు ఆ ఆర్యుని పై గౌరవముతో,
కామముతో ఆ రావణుని అనుసరిస్తున్నారు.
వారి పతి రావణుడు, మహాబలవంతుడు కామముయొక్క అధీనములో వున్నవాడు.
సీతపై మనస్సుకలవాడు.
ఆ రావణుడు మందముగా మదముతోవున్న గతితో వెళ్ళెను.

వారు అలా వస్తూవుంటే,
దూరములో వున్న ఆ మారుతాత్మజుడు
ఆ ఉత్తమస్త్రీల వడ్డాణాల గజ్జెల అందెలధ్వని వినెను.

మహాయశస్సుకల ఆ రావణుడు అందమైన ఆ స్త్రీలతో కలిసి
మృగముల పక్షుల ధ్వనులతో నిండి యున్న ఆ ప్రమదావనము ప్రవేశించెను.
విశ్రవసుని పుత్రుడు, మత్తులోనున్న, విచిత్రమైన ఆభరణములు ధరించియున్న,
శంకువు వంటి చెవులుకల, రాక్షసాధిపుడు అగు ఆ రావణుని
అప్పుడు హనుమంతుడు చూసెను.

ఆ మహాతేజముకల వానరుడు,
' ఈ మహాబాహువులు కలవాడు రావణుడే' అని తలచి కొంచెము దగ్గరగావచ్చెను.
అప్పుడు తేజోమయుడైన హనుమంతుడు ఆ రావణుని తేజస్సుచూచి నిర్ఘాంతపడి
చెట్టుకొమ్మల పత్రములమధ్యలో మరి కొంచెము వెనుకకు జరిగి దాగి యుండెను.

ఇది శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో పదునెనిమిదవ సర్గలో జరిగిన కథ.

||ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||